ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో కనీస వసతులు కరువు
“విద్యార్థులు కన్నీళ్లు పెడుతుంటే మంత్రి సీతక్కకు కనిపించడం లేదా?” – బడే నాగజ్యోతి
స్వాతంత్ర భారత్ న్యూస్ | ఏటూరునాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కంటతడి పెట్టుకుంటూ తమ సమస్యలను వెల్లడించిన విద్యార్థులు హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్‌లో తాగునీటి సదుపాయం సరిగా లేదని, బాత్రూంలు అధ్వానంగా ఉండి వినియోగానికి అనుకూలంగా లేవని విద్యార్థులు వాపోయారు. పరిశుభ్రత, సురక్షితమైన వసతి వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
తమ సమస్యలను ప్రశ్నించినప్పుడు వార్డెన్ దూషిస్తూ, కొడుతున్నారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గు తేల్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డెక్కే పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
“గిరిజన సంక్షేమం గురించి మాట్లాడే మంత్రి సీతక్కకు తన నియోజకవర్గంలోని గిరిజన బాలికల హాస్టల్‌లో విద్యార్థులు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా?” అని ఆమె ప్రశ్నించారు.
“గిరిజన మహిళగా, ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచి మంత్రిగా ఉన్న సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే గిరిజన బాలికల హాస్టల్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మంత్రి కళ్లుతెరిచి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలి” అని బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి ఆరోపణలు నిజమైతే బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. హాస్టల్‌లో తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం, భద్రత, పరిశుభ్రమైన వాతావరణం వంటి అన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క ఇప్పటికైనా రాజకీయ కార్యక్రమాలు పక్కనపెట్టి ఏటూరునాగారం గిరిజన బాలికల హాస్టల్‌ను స్వయంగా సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని బడే నాగజ్యోతి కోరారు.
“విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు BRS పార్టీ వారి పక్షాన నిలబడి పోరాడుతుంది” అని బడే నాగజ్యోతి స్పష్టం చేశారు.