పట్టా–ఆధార్–ఓటీపీ నిబంధనలతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
వెంకటాపురం, సెప్టెంబర్ 6:
స్వతంత్ర భారత్ న్యూస్ – ములుగు ప్రతినిధి:
“దేశానికి వెన్నుముక రైతు.. రైతే రాజు” అని చెప్పే ప్రభుత్వాలు, ఆచరణలో మాత్రం రైతులను సాంకేతిక నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, ఏజెన్సీ నేతకాని కుల హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్ నేతకాని తీవ్రంగా విమర్శించారు.
ఎరువుల పంపిణీకి పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ లింకింగ్, మొబైల్ యాప్‌లు, ఓటీపీ వంటి నిబంధనలు విధించడం వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు యాప్‌ల కోసం సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టాలు లేని ఏజెన్సీ రైతుల పరిస్థితి ఏమిటి?
ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ సరైన హక్కు పత్రాలు లేని రైతులు ఉన్నారని ఈశ్వర్ నేతకాని తెలిపారు. నేతకాని, దళిత, గిరిజన, నిరుపేద సాగుదారులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కూడా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.
“భూమిని సాగు చేసుకుంటున్న రైతుకు పట్టా లేదనే కారణంతో ఎరువులు నిరాకరిస్తే.. ఆ రైతు వ్యవసాయం ఎలా చేయాలి?” అని ప్రభుత్వాలను ప్రశ్నించారు.
పెరుగుతున్న సాగు ఖర్చులు.. దక్కని గిట్టుబాటు ధర
డీజిల్, ట్రాక్టర్ ఖర్చులు, విత్తనాలు, కూలీల రేట్లు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులపై పెట్టుబడి భారం పెరిగిపోయిందన్నారు. ఎంతో కష్టపడి పంట పండించిన తర్వాత మార్కెట్‌లో సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ఒకవైపు పెరిగిన పెట్టుబడులు, మరోవైపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని, ఈ పరిస్థితులు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందిగా మారిన సాంకేతిక ఆంక్షలను వెంటనే తొలగించాలని ఈశ్వర్ నేతకాని డిమాండ్ చేశారు. పట్టాలు లేని ఏజెన్సీ సాగుదారులు, కౌలు రైతులకు కూడా గుర్తింపు ఆధారంగా ఎరువులు అందించాలని కోరారు.
ఎరువులు, పురుగుమందుల ధరలను నియంత్రించి రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవడంతో పాటు అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించకపోతే ఏజెన్సీ నేతకాని కుల హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జాడి ఈశ్వర్ నేతకాని హెచ్చరించారు.