SBNEWS, పినపాక: మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ సంకీర్త్ సూచించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు, కల్వర్టులు, లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. పాత, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తున్న వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలు, నీటిలో మునిగిన ట్రాన్స్‌ఫార్మర్లకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ సంబంధిత ప్రమాదాలు కనిపిస్తే వాటిని తాకకుండా సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. వర్షాకాలంలో తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని ఎంపీడీఓ సూచించారు. పిల్లలు, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
