స్వాతంత్ర్య భారత్ న్యూస్, ములుగు జిల్లా, తాడ్వాయి: తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధిలో వాడీవేడిగా గ్రామసభ నిర్వహించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావం, భవిష్యత్‌లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశాలపై గ్రామసభలో చర్చ జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల అంశం గ్రామసభలో చర్చకు రావడంతో గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు, అమలు ప్రక్రియపై ప్రజలు వివరాలు కోరారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానాలు ఇవ్వడంతో గ్రామసభ ఆసక్తికరంగా సాగింది.
గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో గ్రామస్తులు, వార్డు సభ్యుల భాగస్వామ్యం ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా జరిగేలా ప్రజల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. గ్రామపంచాయతీ సెక్రటరీ అజ్మీర ధర్మేందర్, జీపీ మురళి, టెక్నికల్ అసిస్టెంట్ రాజ్‌కుమార్, సీసీ కుమారస్వామి, ఉపసర్పంచ్, అంగన్‌వాడీ టీచర్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.