స్వాతంత్ర్య భారత్ న్యూస్, కరకగూడెం: పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3)కు సవరణ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ చట్ట సవరణ మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.
మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని సంబంధిత గ్రామపంచాయతీ ఖాతాలోనే జమ చేసుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా తీర్మానం ద్వారా అభివృద్ధి పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించేలా చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు.
గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు, నిర్ణయాధికారం అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు తమ పరిధిలోని ప్రజల అవసరాలను గుర్తించి, అత్యవసర అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
ఇదే సందర్భంగా పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పినపాక నియోజకవర్గంలో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు తీసుకెళ్లి నిధులు సాధించడంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.
“పినపాక అభివృద్ధి అంటేనే పాయం.. పాయం అంటేనే అభివృద్ధి” అని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు సద్వినియోగం అయ్యేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ సర్పంచ్, నియోజకవర్గ నాయకుడు తోలెం నాగేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షుడు కల్తీ విజయ్, సర్పంచులు ఎర్రం పొట్టయ్య, పోలేబోయిన సుజాత, తోలెం రమేష్, కొమరం సుగుణ, ఎల్లబోయిన ముత్తమ్మ, బాడిష పార్వతి, ఉపసర్పంచులు పూజారి వెంకన్న, పోలేబోయిన రాణి, పోలేబోయిన స్వర్ణలత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడి శ్రీను, సీనియర్ నాయకులు నేతాజీ, అత్తే సారయ్య, కోర్స బుచ్చయ్య, మండల నాయకులు షేక్ రఫీ, పాలేబోయిన సీతారాంబాబు, ఎల్లబోయిన సత్యం, మోకాళ్ల పాపారావు, తోలెం కృష్ణ, సోలం బాబు, కరకపల్లి నాగేష్, అత్తే నరసింహారావు, గోగు కిరణ్, కటకం నరసింహారావు, వడ్లకొండ సాంబ, మాజీ ఉపసర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.