జర్నలిస్టుల సేవలు అభినందనీయం....ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పలువురు వక్తలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డొంకన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జర్నలిస్టులకు జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకురావడం ద్వారా పరిష్కారానికి మార్గం చూపుతున్నారని పేర్కొన్నారు.
24 గంటలూ ప్రజల కోసం
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డొంకన చంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ డే వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు 365 రోజులూ, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడికి చేరుకుని వివరాలను సేకరించి ప్రజల ముందుకు తీసుకురావడం జర్నలిస్టుల విధిగా మారిందన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల దినోత్సవాన్ని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. అందుకే జర్నలిస్టులంతా ఐక్యంగా జర్నలిస్ట్ డే వేడుకలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వృత్తి పరమైన హక్కుల పరిరక్షణకు ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
పలువురి అభినందనలు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, యం. లక్ష్మీరెడ్డి, ఎస్.కే. సైదులు, ఇంగువ రమేష్, బెల్లంకొండ వాసు, ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, పాకాల భరత్, వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. వాస్తవాలను ప్రజలకు చేరవేస్తూ సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
Tags
burgampadu