పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీలో అవినీతి జరిగిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో, ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టను దెబ్బతీయాలనే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.గ్రామపంచాయతీలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేస్తున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయాలని సర్పంచ్ పూనెం వెంకటేష్ సవాల్ విసిరారు. నిజంగా అవినీతి జరిగిందని ఆధారాలు ఉంటే సంబంధిత అధికారుల ముందు పెట్టి విచారణ కోరాలని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సర్పంచ్, పాలకవర్గం అన్నారు. తోగ్గూడెం గ్రామ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎవరు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ కక్షలతో వ్యవహరిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.తప్పుడు ప్రచారాలతో గ్రామపంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని, అవసరమైతే ప్రతి ఆరోపణకు ఆధారాలతో ప్రజల ముందే సమాధానం ఇస్తామని సర్పంచ్ వెంకటేష్ ఘాటుగా స్పందించారు. తాను గిరిజనుడినైనందువల్లే కొంతమంది వ్యక్తులు తనపై కక్ష కట్టి బద్నామ్ చేయాలని చూస్తున్నారని, వారికి తగిన సమాధానం చెప్పే రోజులు ఉన్నాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ తాటి జాన్ బాబు, కాంగ్రెస్ మండల నాయకులు చిట్టిమళ్ల సతీష్ చారి, డొంకెన సాంబశివరావు, పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోరం నాగేశ్వరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి అంకతి సిద్ధయ్య, పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

