కొత్తగూడెం, సెప్టెంబర్ 13: ముస్లిం ఐక్య సంఘం (MAS) తెలంగాణ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి “జల్సా-ఏ-ఆమ్ సీరతున్నబీ ” సభ విజయవంతంగా జరిగింది. “సమస్త మానవాళికి ప్రవక్త మహమ్మద్ ﷺ సందేశం” అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉలమాలు, మతపెద్దలు, వివిధ వర్గాల ప్రముఖులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖుర్‌ఆన్ పారాయణం, నాత్-ఎ-షరీఫ్‌తో సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రవక్త మహమ్మద్ జీవిత విశేషాలు, ఆయన బోధనలు, మానవ సమాజానికి అందించిన సందేశాన్ని వివరించారు. ప్రవక్త మహమ్మద్ బోధనలు శాంతి, కరుణ, న్యాయం, సమానత్వం, క్షమ, సోదరభావం, సేవలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన సందేశం ఒక మతానికి మాత్రమే పరిమితం కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకంగా ఉంటుందని వక్తలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ, గౌరవం, సహకారంతో మెలగాలని పిలుపునిచ్చారు.
సభలో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ ఇషాఅతి మాట్లాడుతూ ముస్లిం సమాజం విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యత, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలని, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.మౌలానా సల్మాన్ బిజ్నోరీ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని సూచించారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ బోధనలను నిత్యజీవితంలో ఆచరించినప్పుడే వాటి అసలైన ప్రయోజనం సమాజానికి అందుతుందని తెలిపారు. ప్రవక్త జీవితంలో కనిపించే కరుణ, సహనం, క్షమ, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు.డాక్టర్ హాఫిజుల్ రహమాన్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు, నష్టాల్లో ఉన్న వ్యాపారులకు అండగా నిలవాలని సూచించారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, మానవత్వంతో స్పందించడం ప్రవక్త మహమ్మద్ బోధనల్లో ముఖ్యమైన అంశాలని వివరించారు.బ్రదర్ సిరాజ్ మాట్లాడుతూ ఇస్లాం కత్తుల ద్వారా వ్యాప్తి చెందిందనే ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. భారతదేశంతో ఇస్లాం అనుబంధం శతాబ్దాల నాటిదని వివరించారు. చరిత్రను వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అపోహలు, అపార్థాలు తొలగించేందుకు పరస్పర అవగాహన, సంభాషణ అవసరమని తెలిపారు.సభకు ముఖ్య అతిథిగా హాజరైన స్వామి లక్ష్మీ శంకరాచార్య మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ ﷺ ప్రపంచంలోని ప్రతి మానవుడికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయన బోధనల్లో శాంతి, మానవత్వం, సోదరభావానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మనుషుల మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర సహకారం పెరిగినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు.వివిధ మతాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి శాంతి, మానవత్వం, సోదరభావం గురించి సందేశాలు ఇవ్వడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మతాల మధ్య పరస్పర గౌరవం, సామాజిక ఐక్యత, మానవత్వ విలువలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు వివరించారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను కేవలం ప్రసంగాలకు పరిమితం చేయకుండా వాటిని నిత్యజీవితంలో ఆచరించాలని సూచించారు.కార్యక్రమంలో ముఫ్తీ ఖాసిముద్దీన్ నూరీ, అబ్దుల్ ఖుద్దూస్, హయాతుల్ హసన్, మౌలానా అబ్దుల్ కరీం, మౌలానా ఇనాయతుల్లా, అబిద్ హుస్సేన్, జియావుద్దీన్, హుస్సేన్ అలీ, జహంగీర్ షరీఫ్, అబ్దుల్ బాసిత్, జావిద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు రజాక్ తదితరులు సభకు హాజరయ్యారు.సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు సహకరించారు. కొత్తగూడెం క్లబ్ యాజమాన్యం కూడా కార్యక్రమ నిర్వహణకు సహకరించింది. స్వచ్ఛంద సేవకులు, ముస్లిం పెద్దలు, యువత కార్యక్రమ ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించారు.ఈ సందర్భంగా సభ విజయవంతానికి సహకరించిన ఉలమాలు, మతపెద్దలు, అతిథులు, వక్తలు, పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు, కొత్తగూడెం క్లబ్ యాజమాన్యం, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, ముస్లిం పెద్దలు, యువత, ప్రజలకు ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ ఇషాఅతి, ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్తో పాటు సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సేవాభావం, సోదరభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. సభలో పాల్గొన్న ప్రజలు కూడా ప్రవక్త మహమ్మద్ ﷺ బోధించిన మానవతా విలువలను ఆచరించడంతో పాటు సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

