- కాంగ్రెస్ మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు
స్వాతంత్ర్య భారత్ న్యూస్, పినపాక: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.186 కోట్ల హెచ్‌ఏఎం నిధులు మంజూరు చేయడం హర్షణీయమని పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఇంత భారీ స్థాయిలో నిధులు మంజూరు కావడం ద్వారా ప్రజల చిరకాల సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, మారుమూల గ్రామాలకు అనుసంధానం మరింత బలోపేతం అవుతుందన్నారు .ముఖ్యంగా దసరా పండుగలోపే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటుండటం అభినందనీయమన్నారు. హెచ్‌ఏఎం విధానంలో చేపట్టే పనులకు సుమారు 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత సంబంధిత సంస్థలే చేపట్టే అవకాశం ఉండటంతో రహదారుల నాణ్యత, నిర్వహణకు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు.
పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు పేరం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిధుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రూ.186 కోట్ల నిధులతో పినపాక నియోజకవర్గంలోని రహదారులు, వంతెనల రూపురేఖలు మారనున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారంభమై పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.