ఓటర్ జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలి: ఐటీడీఏ పీఓ బి. రాహుల్
మణుగూరు, మే 01:ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను బిఎల్వోలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి క్రమబద్ధంగా నిర్వహించి, నిర్దేశిత గడువులో పూర్తిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత తహసీల్దారులకు ఆదేశించారు.
శుక్రవారం మణుగూరు ఇల్లందు క్లబ్‌లో 110-పినపాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వీఆర్వోలు, ఏఈఆర్వోలు, బిఎల్వోలు, సూపర్వైజర్లతో ఆయన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2002 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లు తప్పనిసరిగా 2025 ఓటర్ లిస్టులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు సూపర్వైజర్లు, బిఎల్వోలు బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్వోలతో సమన్వయం పెంచుకొని, మ్యాపింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని, ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌తో పాటు ఇతర మండలాల తహసీల్దార్లు, బిఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
— అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం
Tags
మణుగూరు